ఏటూరునాగారం: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా 2వ మహాసభలు శనివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలోని యువతకు ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం హామీనిచ్చి మరిచిందన్నారు. 12 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ మరో వైపు నీట్, రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా ప్రశ్నపత్రాల లీకులకు పాల్పడుతూ యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారని హామీనిచ్చారని వివరించారు. కాని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవీందర్, అరుణ్, లాజర్, కృష్ణబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్, జిల్లా నాయకులు మమత, శ్యామ్, రమేశ్, రాఘవేంద్ర, సంతోష్, శివ, ప్రవీణ్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వెంకటేశ్


