నోటీసులు వచ్చినా.. ఆధారాలు సమర్పించని ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

నోటీసులు వచ్చినా.. ఆధారాలు సమర్పించని ఓటర్లు

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

జిల్లాలో 41,900 అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లు

ఓటర్ల వివరాలు

ములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలనలో భా గంగా జిల్లాలో అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేటగి రీలో గుర్తించిన ఓటర్లకు బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) నోటీసులు జారీ చేస్తున్నా.. చాలామంది ఓటర్లు స్పందించకపోవడం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఓటరు జాబితాలో పేర్లు, ఇంటి వివరాలు, ఇతర నమోదిత సమాచారంలో తేడాలు లేదా మ్యాపింగ్‌ సమస్యలు ఉన్నవారిని గుర్తించి ఆధారాలు సమర్పించాలని ఆగస్టు 25వ తేదీ నుంచి నోటీసులు ఇస్తున్నారు. అయితే నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 41,900 మంది అనామలీస్‌,

నో మ్యాపింగ్‌ ఓటర్లు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో 308 పోలింగ్‌ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడించారు. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా ఇంకా జిల్లాలో 41,900 మంది ఓటర్లను అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేటగిరీలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరికి బీఎల్‌ఓలు నోటీసులు జారీ చేసి తగిన ఆధారాలు సమర్పిస్తే ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని బీఎల్‌ఓలకు అందించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

28,265 మందికి నోటీసులు..

జిల్లాలో 41,900 మంది అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 28,265 మందికి బీఎల్‌ఓలు నోటీసులు జారీ చేశారు. మరో 13,635 మందికి నోటీసులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో 9,686 మంది మాత్రమే నోటీసులకు స్పందించి ఆధారాలు సమర్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 10,976 మంది ఓటర్లు నోటీసులు అందుకున్నప్పటికీ వారికి ఇచ్చిన గడువు దాటినప్పటికీ స్పందించలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో సంబంధిత ఓటర్ల విషయంలో తదుపరి ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

చిన్నపాటి తప్పిదాలకు నోటీసులేనా..!

ఓటర్ల వివరాల నమోదు, డిజిటలైజేషన్‌, మ్యాపింగ్‌ ప్రక్రియలో చోటుచేసుకున్న తేడాల కారణంగా అనామలీస్‌ కేటగిరీలో కొందరి పేర్లు నమోదు అయ్యాయి. అంతేకాకుండా పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు, వివరాల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు కూడా నోటీసులు జారీ చేయడంతో ఓటర్లు ఆధారాలు సమర్పించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నా.. ఓటర్లు స్పందించకపోవడం అధికారులను అయోమయానికి గురిచేస్తుంది.

గడువు పెంపు

అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు సంబంధించిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరించేందుకు ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 16 వరకు గడువు నిర్ణయించింది. అయితే ఓటర్లకు మరింత అవకాశం కల్పించేందుకు ఎన్నికల సంఘం ఈ గడువును అక్టోబర్‌ 7 వరకు పొడిగించింది. గడువు పెంచినా..నోటీసులు అందుకున్న ఓటర్లు స్పందించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. చిన్న చిన్న తప్పిదాలకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఓటు కోల్పోతే కొత్తగా ఫారం–6 ద్వారా మళ్లీ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకుంటామని నోటీసులు అందుకున్న కొంతమంది బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement