ఇంటింటా పోషణ సంబురాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా పోషణ సంబురాలు

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

గోవిందరావుపేట: పోషకాహార ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో శుక్రవారం పోషణ మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్‌ మోక్ష రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీసీ రజియాబేగం హాజరై మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, మహిళలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషణపై అవగాహనను అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం చేయకుండా ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంటింటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

కోటగుళ్లలో

ప్రత్యేక పూజలు

గణపురం: శ్రావణ మాసం చివరి రోజు శ్రావణ శుక్రవారం కావడంతో గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో గణపేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.

వేగంగా స్పందించాలి

టేకుమట్ల: అత్యవసర సమయంలో బాధితులు 108కి కాల్‌ చేస్తే అంబులెన్స్‌ పైలట్‌, ఈఎంటీ వేగంగా స్పందించాలని 108 జిల్లా మేనేజర్‌ రాజునాయక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని 108 వాహనాన్ని తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వైద్య పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ అత్యవసర సమయంలో కీలకంగా వ్యవహరించి కాల్‌చేసిన వారికి 108 లో సకాలంలో ప్రాథమిక చికిత్స అందిస్తూ స మీప ఆస్పత్రులకు చేర్చాలన్నారు. నిత్యం మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పైలట్‌ సత్యం, ఈ ఎంటీ బొమ్మ హరిప్రసాద్‌లకు సూచించారు.

హాకీ పోటీల్లో రాణించాలి

భూపాలపల్లి అర్బన్‌: క్రీడలు మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్‌ వర్క్‌ను పెంపొందిస్తాయని ఏరియా సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణకాలనీలోని అంబేడ్కర్‌ స్టేడియంలో డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ ఆధ్వర్యంలో భూపాలపల్లి, రామగుండం–3 ఏరియాల హాకీ రీజినల్‌ పోటీలకు జీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానంలో వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌కు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాల్లో గణనీయంగా మహిళా అధికారులు నియమితులయ్యారని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారని, మహిళా రెస్క్యూ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. సింగరేణిలో అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ మహిళా ఉద్యోగులు స్ఫూర్తిగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. త్వరలో జరిగే కోల్‌ ఇండియా క్రీడా పోటీల్లో సింగరేణిని అగ్రస్థానంలో నిలిపేందుకు క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పతకాలు సాధించాలని కోరారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను, పోటీల్లో పాల్గొంటున్న ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యామ్‌సుందర్‌, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, గుర్తింపు సంఘం బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేశ్‌, ప్రాతినిథ్య సంఘం ఉపాధ్యక్షుడు బి.మధుకర్‌రెడ్డి, సీఎంఓఐ అధ్యక్షుడు నజీర్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ పర్స శ్రీనివాస్‌, భూపాలపల్లి స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ జి.నాగేశ్వర్‌రావు, ఆర్జీ–3 స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ బి.సదానందంతో పాటు క్రీడాకారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement