ఏటూరునాగారం: ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాల కళ సాకారం కాబోతుంది. ఎన్నో కష్టాలు, ప్రమాదాలను ఎదుర్కొని జీవిస్తున్న కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం గ్రామస్తుల కళ సాకారమయ్యే రోజులు సమీపంలో ఉన్నాయి. మంత్రి సీతక్క చొరవతో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.16.50 కోట్లు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఏటూరునాగారం మండలంలోని మల్యాల, దొడ్ల గ్రామాల మధ్యలోని జంపన్నవాగు కొండాయి బ్రిడ్జి పూర్తికాబోతుంది. 7 పిల్లర్లు, రెండు అంబాడ్స్‌మెట్లతో నిర్మాణం పనులు చేపట్టిన ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు పనులను వేగంగా జరిగేందుకు కావాల్సి న ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పిల్లర్లు, గడ్డర్స్, అబాడ్స్‌మెట్లు పూర్తి కాగా ప్రస్తుతం బ్రిడ్జిపై ఐదు స్లాబ్‌లను పూర్తి చేశారు. మరో మూడు స్లాబ్‌లు దసరా నాటికి పూర్తికానున్నాయి. వచ్చే నెల దసరాకు కొండాయి బ్రిడ్జి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
30 సంవత్సరాల నుంచి..
30 సంవత్సరాల నుంచి అనేక కష్టాలను ఒర్చుకుంటున్న ప్రయాణిస్తున్న వాగవతలి గ్రామాల కష్టాలు ఈ బ్రిడ్జితో తీరనున్నాయి. బ్రిడ్జి నుంచి కొండాయి గ్రామానికి కూడా శాశ్వత రోడ్డు నిర్మాణం చేపడితే రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. పనులు శరవేగంగా జరుగుతుండడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామని ప్రజలు వాపోతున్నారు. జంపన్నవాగు ప్రవహిస్తున్నప్పటికీ పనులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు చేపట్టినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
త్వరలో అందుబాటులోకి కొండాయి బ్రిడ్జి
రూ.16.50కోట్లతో నిర్మాణ పనులు


