వాజేడు: మండలంలోని పేరూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం కూలి పనులకు వెళ్లిన చోట విద్యుత్‌షాక్ గురై పంది సమ్మయ్య, తుమ్మ అభిషేక్ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పేరూరు గ్రామానికి చెందిన తాటి శంకరయ్య అనే రైతు సాగు చేస్తున్న ఏడు ఎకరాల మిర్చి చేనులో మల్చింగ్ షీట్ వేయడానికి వెళ్లిన సమయంలో విశ్రాంతి కోసం కంచె వద్దకు వచ్చిన కూలీలు అక్కడ కూర్చున్నారు. అదే సమయంలో విద్యుత్ వైరు తెగి కంచెకు ఆనుకుని ఉండటంతో దానికి కూడా విద్యుత్ ప్రసారం అవుతోంది. అది తెలియక సమ్మయ్య కంచెను పట్టుకోవడంతో విద్యుత్‌ఘాతానికి గురయ్యాడు. అతడిని రక్షించేందుకు అభిషేక్, పోశెట్టి నరేష్ ఒకరినొకరు పట్టుకున్నారు. ఈ క్రమంలో సమ్మయ్య, అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందగా నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అభిషేక్ భార్య బాలింత..
కూలి పనులకు వెళ్తేనే పొట్ట గడిచే కుటుంబం కావడంతో అభిషేక్ ప్రతీ రోజు కూలికి వెళతాడు. సంవత్సరం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. భార్య పూజ బాలింత కాగా మూడు నెలల బిడ్డను ఇంటి వద్ద ఉంచి రోజు లాగానే శుక్రవారం కూలి పనులకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ ప్రమాదంలో అభిషేక్ ప్రాణాలను కోల్పోయాడు. కూలి పనులు ముగియ గానే భర్త ఇంటికి వస్తాడని ఎదురుచూసిన భార్యకు భర్త మృతి వార్త తీరని వేదనను మిగిల్చింది. కాగా సమ్మయ్యకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉండగా ఇద్దరు కుమారులకు, కుమార్తెకు పెళ్లి కాగా మరో కుమారుడికి పెళ్లి కావాల్సి ఉంది. సమ్మయ్య భార్య గతంలోనే మృతి చెందింది. సమ్మయ్య, అభిషేక్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఇద్దరి మృతితో విలపిస్తున్న
కుటుంబ సభ్యులు


