ఏటూరునాగారం/మంగపేట/ఎస్‌ఎస్ తాడ్వాయి / వాజేడు : జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. పలు సెంటర్లలో విద్యార్థులు ప్రతిరోజూ అంగన్ వాడీ కేంద్రాలకు కొంతమంది మాత్రమే హాజరవుతున్న పరిస్థితి ఉంది. అలాగే గర్భిణులు, బాలింతలకు అందించాల్సిన గుడ్లు, బియ్యం, పాల ప్యాకెట్లు నెలకు సరిపడా ఇంటికే పంపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సిన ఫ్రీ స్కూళ్లు పలుచోట్ల మధ్యాహ్నం తర్వాత మూసి ఉంటున్నాయి. ఈ మేరకు పోషణ్ అభియాన్ మాసోత్సవాల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను సాక్షి విజిట్ చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పౌష్టికాహారం ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఉదయం 10 గంటల వరకు ఉడికించిన కొడిగుడ్లు ఇవ్వాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు పప్పు, కూరగాయలతో కూడిన భోజనం వడ్డించాలి. సాయంత్రం 3గంటలకు స్నాక్స్, 3.30 గంటలకు 100 ఎంఎల్ పాలు అందించాలి. అదే విధంగా గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నం గుడ్డుతో భోజనం, 200 ఎంఎల్ పాలు, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు నెలకు 16 గుడ్లు, బాలమృతం ప్యాకెట్ అందించాల్సి ఉంది.
చిన్నసైజ్ కోడిగుడ్లు..
ఏటూరునాగారం మండల కేంద్రంలోని కోడిగుడ్లు చిన్న సైజ్‌లో వస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. నేతాజీ నగర్ సెంటర్‌లో ఒక గర్భిణి, బాలింతలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే క్రాస్‌రోడ్డు సెంటర్‌లో ఇద్దరు గర్భిణులు, ఇద్దరు బాలింతలు ఉండగా ఫ్రీ స్కూల్ పిల్లలు ఐదుగురు మాత్రమే ఉన్నారు. గ్యాస్ బిల్లులు మూడు నెలల నుంచి పడడం లేదని టీచర్లు తెలిపారు.
14 మందికి.. 11 మంది హాజరు
ఎస్‌ఎస్ తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 14 మంది పిల్లలకు గాను 11 మంది మాత్రమే హాజరయ్యారు. పిల్లలకు ఉదయం కోడిగుడ్డు, పాలు అందించగా మధ్యాహ్నం సోరకాయ పప్పు కూరతో భోజనం వడ్డించారు. 12 గంటలకు తాడ్వాయిలోని 1వ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా ఆరుగురు పిల్లలకు నలుగురు పిల్లలు హాజరయ్యారు. పిల్లలతో పాటు నలుగురు గర్భిణులకు మెనూ ప్రకారం సోయకాయ పప్పు భోజనం వడ్డించారు. అలాగే నిబంధనల మేరకు పిల్లలకు 100 ఎంఎల్, తల్లులకు 200 ఎంఎల్ పాలతో పాటు భోజనాన్ని అందజేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాలపై
కొరవడిన ఉన్నతాధికారుల నిఘా
పలు కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు
ఇంటికే ఇచ్చి పంపిస్తున్న సరుకులు
పూర్తిస్థాయిలో కనిపించని
విద్యార్థుల సంఖ్య


