ఏటూరునాగారం: విద్యార్థుల సమస్యల ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు, భోజనం అందించాల్సిన అధికారులు, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్‌చార్జీలను ప్రభుత్వం పెంచాలన్నారు. అలాగే సకాలంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఏపీఓ దామోదరస్వామి, డీడీ జనార్దన్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి, నాయకులు మధు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్


