ములుగు: రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో దాడులు చేస్తూ రైస్ మిల్లుల యజమానులను ప్రభుత్వం వేధింపులకు గురిచేయొద్దని రైస్‌మిల్లర్స్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయ శివారులో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడారు. యాసంగి, వానాకాలం సీజన్‌లో లక్షల క్వింటాళ్ల వడ్లను కస్టమ్ మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించామని తెలిపారు. అయితే ఆ బియ్యానికి సంబంధించిన సీఎంఆర్ బకాయిలు, కస్టమ్ మిల్లింగ్ చార్జీలు ఇప్పటి వరకు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని, మిల్లులు సైతం నడపలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోధర్ రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెల్లి హరినాథ్, గౌరవ అధ్యక్షుడు పల్లెపాటి సమ్మిరెడ్డి, మిల్లర్లు పాల్గొన్నారు.
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
బాదం ప్రవీణ్


