అనుమతులపై అనుమానాలెన్నో.. | - | Sakshi
Sakshi News home page

అనుమతులపై అనుమానాలెన్నో..

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

బొగ్గు తవ్వకాలతో కనుమరుగుకానున్న

పచ్చని పంట పొలాలు

రామప్ప ఆలయానికి పొంచి ఉన్న ప్రమాదం

ప్రపంచ వారసత్వ సంపదపై ఆందోళన

ములుగు: ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రామప్ప ఆలయ వారసత్వ సంపద.. మరోవైపు దట్టమైన అడవులు, పచ్చని చెట్లతో ఎతైన కొండలు, రైతులకు సిరులు కురిపించే వ్యవసాయ భూములు, జల వనరులు.. వీటన్నింటి మధ్యలోకి ఇప్పుడు ఓపెనన్‌కాస్ట్‌ గని పేరుతో బొగ్గు తవ్వకాల ప్రతిపాదన రావడం జిల్లాలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన పీవీఎన్‌ఆర్‌ గనితో ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ప్రజల జీవనాధారం, చారిత్రక వారసత్వ సంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

భౌగోళిక స్వరూపంలో మార్పు

భూమిని వందల అడుగుల లోతు వరకు తవ్వి బొగ్గును వెలికితీసే ఓపెన్‌న్‌కాస్ట్‌ విధానం అమలైతే ఈ ప్రాంత భౌగోళిక స్వరూపమే మారిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ యంత్రాలు, పేలుళ్లు, రవాణా వాహనాలతో దుమ్ము, శబ్ద కాలుష్యం పెరగడం.. భూగర్భ జలాలపై ప్రభావం పడటం.. పంట పొలాలు, అడవులు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా చారిత్రక కట్టడమైన రామప్ప ఆలయం ఉన్న ప్రాంతంలో భారీ స్థాయి తవ్వకాల కోసం పెద్ద ఎత్తున బ్లాస్టింగ్‌లు చేపట్టడం వల్ల కలిగే పర్యావరణ, భౌగోళిక ప్రభావాలపై సమగ్ర అధ్యయనం అవసరమన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఓపెన్‌కాస్ట్‌కు సంబంధించిన ప్రతీ అంశాన్ని బహిరంగంగా వెల్లడించి, ప్రజాభిప్రాయాన్ని తీసుకుని పర్యావరణం–రామప్ప వారసత్వంపై నిపుణులతో సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

2,648 ఎకరాలుభూమి అవసరం

ఓపెన్‌కాస్ట్‌ గని కోసం సుమారు 2,648 ఎకరాల భూమి అవసరం ఉందని తెలుస్తోంది. ఇందులో 1,164 ఎకరాల అటవీ భూమి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారీగా మట్టిని తొలగించడం, చెట్ల నరికివేత, గనుల వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తవ్వకాల్లో వందల మీటర్ల లోతు వరకు మట్టి, రాళ్లను తొలగించాల్సి ఉంటుంది. దీంతో భూగర్భ జలాల సహజ ప్రవాహంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయం కోసం బోర్లపై ఆధారపడే రైతులు, గ్రామాల తాగునీటి వనరులపై దీని ప్రభావం ఎంత ఉంటుందన్నది ముందుగానే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గని పరిధిలోకి వచ్చే పట్టా, అసైన్డ్‌ భూములతో పాటు పరిసర వ్యవసాయ భూములపై కూడా గనుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. బ్లాస్టింగ్‌ వల్ల వచ్చే ప్రకంపనలు, శబ్దం పరిసర గ్రామాల ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రామప్ప ఆలయంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది తేల్చాల్సిన అవసరం ఉంది.

20 ఏళ్లలో.. 40 మిలియన్‌ టన్నుల బొగ్గు

గని ప్రారంభమైతే సుమారు 20 ఏళ్లలో 40 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రెండు దశాబ్దాల పాటు భారీస్థాయిలో తవ్వకాలు, బొగ్గు రవాణా, యంత్రాల వినియోగం కొనసాగనున్నాయి. ఇంత సుదీర్ఘ కాలంలో పర్యావరణంపై పడే సమగ్ర ప్రభావాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు పొందిన ఏకై క కట్టడం రామప్ప దేవాలయం. ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేవలం ఇసుకనే పునాదిగా చేసి నిర్మించారు. రామప్ప ఆలయానికి 5.8 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న పీవీఎన్‌ఆర్‌ గనికి మైనింగ్‌, పర్యావరణం, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌, పురావస్తుశాఖ అనుమతులు పొందినట్లు ప్రచారం ఉంది. కేవలం పాలంపేట డెవలప్‌మెంట్‌ కమిటీ ఇచ్చే ఎన్‌ఓసీ కోసం సింగరేణి సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటవీ సంపదతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి దగ్గరలో ఉన్న ఓపెన్‌కాస్ట్‌ గనిని ప్రారంభించేందుకు వివిధ శాఖల నుంచి అనుమతులు ఏ విధంగా మంజూరవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతుల మంజూరుపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఓపెన్‌కాస్ట్‌ గనిని వ్యతిరేకిస్తున్నాం..

రామప్ప ఆలయానికి 5.8 కిలో మీటర్ల దూరంలో సింగరేణి సంస్థ చేపట్టే ఓపెన్‌కాస్ట్‌ గనిని కాకతీయ ట్రస్టు తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓపెన్‌కాస్ట్‌ను నిలిపివేసి ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప ఆలయాన్ని కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విన్నవించాం. భవిష్యత్‌ తరాలకు వారసత్వ సంపదను అందించే రామప్ప ఆలయం, రామప్ప సరస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

– ప్రొఫెసర్‌ పాండురంగారావు,

కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement