సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ బలోపేతంపై అధి ష్టానం దృషిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్‌కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థి సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది.
రామప్పలో
జర్మనీ దేశస్తురాలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని జర్మనీ దేశస్తురాలు మోనికా బుధవారం సందర్శించారు. రామలింగేశ్వర స్వామిని ఆమె దర్శించుకోగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవాన్ని టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేశ్ ఆమెకి వివరించారు.
వనదేవతలను
దర్శించుకున్న అన్వేష్‌రెడ్డి
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం వనదేవతలను టీపీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సీడ్ కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ అన్వేష్‌రెడ్డి బుధవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు సమ్మక్క పూజారి సిద్ధబోయిన రాణారమేశ్ ఆయనకు కండువా కప్పి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చెర్ప రవీందర్, తదితరులు ఉన్నారు.
హక్కుల కోసం పోరాటం
చిట్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం పీఆర్‌టీయూ టీఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని మోడల్ స్కూల్‌లో మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అధ్యక్షతన మండల శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా 23 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంఈఓ కోడెపాక రఘుపతి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్‌కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఝాన్సీరాణి, వాసంతి, పీడీ సూదం సాంబమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
దుకాణాలు తొలగించాలి
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఫుట్‌పాత్‌లపై ఏర్పాటుచేసిన దుకాణాలను తొలగించాలని రోడ్ సేఫ్టీ టాస్క్‌పోర్స్ టీం అధికారులు యాజమానులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి గణేష్‌చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను బుధవారం పరిశీలించారు. దుకాణాల ఎదుట ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన వస్తువులు, తోపుడు బండ్లు, ఇతర వ్యాపారాలను తొలగించాలని యజమానులను ఆదేశించారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేయడం, వస్తువులు, బోర్డులు ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎన్‌హెచ్ డీఈ సింధూర, ఎస్సై శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.


