ములుగు: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి, వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాల ప్రచారం, అభివృద్ధికి ఆసక్తి కలిగిన యువతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 142 పర్యాటక ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో సందర్శకులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక ప్రాంతాలను ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, టూరిజం నోడల్ ఆఫీసర్ ధర్మనాయక్, డీఈఓ సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు.
వీసీలో పర్యాటక, సాంస్కృతిక శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్


