జోహెర్ మిల్ పునఃప్రారంభం
విద్యార్థులకు అందనున్న పోషకాహారం
ఏటూరునాగారం: గిరిజన విద్యార్థులకు పోషకాహారం అందించడానికి మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్డులో పడావు పడిన జోహెర్ మిల్ కుటీర పరిశ్రమను ఎట్టకేలకు ఐటీడీఏ అధికారులు మహిళా సంఘం సభ్యుల ద్వారా పునఃప్రారంభించారు. మూడేళ్ల నుంచి మూలకు పడిన కుటీర పరిశ్రమపై ఇటీవల ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ మేరకు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా స్పందించి కుటీర పరిశ్రమను వెంటనే ప్రారంభించి గిరిజన విద్యార్థులకు పోషకాలతో కూడిన జోహెర్ మిల్ పౌడర్‌ను తయారు చేసి వెంటనే అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐటీడీఏ యంత్రాంగం కుటీర పరిశ్రమ నిర్వాహకులు స్వయం కృషి గిరిజన మహిళా సంఘం సభ్యులు పరిశ్రమను ప్రారంభించి ఉత్పత్తి చేసేలా చర్యలు చేపట్టారు.
2,883 కిలోల ఉత్పత్తికి కసరత్తు
మండలకేంద్రంలోని క్రాస్‌రోడ్డులో స్వయం కృషి జోహెర్ మిల్ కుటీర పరిశ్రమలో రాగులు, జొన్నలు, సజ్జలతో పౌష్టికాహారం 2,883 కిలోల ఉత్పత్తిని తయారు చేయడానికి మహిళా సంఘం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 2,840 కిలోల పౌడర్ కావాలని ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ (విద్యాశాఖ) విభాగం డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ వర్క్ ఆర్డర్ ఇవ్వడంతో మూడు రోజుల నుంచి 500ల కిలోల పౌడర్‌ను తయారు చేశారు. మిగతాది కూడా తయారు చేసి జోహెర్ మిల్ ప్యాకెట్లుగా రూపొందించి దానిని జీసీసీ ద్వారా గిరిజన విద్యాసంస్థలకు సరఫరా చేస్తారు. దీంతో గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం, తయారీదారులకు ఆర్థిక ఫలాలను అందనున్నాయి.
44 విద్యాసంస్థలకు లబ్ధి
జిల్లాలోని 44 గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 7,311 మంది బాలబాలికలకు జోహెర్ మిల్ పౌడర్‌ను అందించనున్నారు. ఇప్పటికే పౌడర్ ప్యాకెట్లు సిద్ధం కాగా వాటిని వంతుల వారీగా విద్యాసంస్థలకు సరఫరా చేయనున్నారు. దీంతో గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మిగతా న్యూట్రిన్ పోషకాలతో పాటు జోహెర్ మిల్ పౌడర్‌ను పాలల్లో కలిసి ఇవ్వనున్నారు. దీంతో చురుకుదనం, జ్ఞాపకశక్తి, విజ్ఞానం పెంపొందే అవకాశాలున్నాయి.
ఇప్పటికే 2,883 కిలోల వరకు
వర్క్ ఆర్డర్
ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా కొనుగోలు
జోహెర్ మిల్ పునఃప్రారంభం


