ఎదురుచూపులు
ముందుకు సాగని
సంక్షేమ పథకాలు
ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి మోక్షమెప్పుడో?
ఏటూరునాగారం: గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏటూరునాగారం మండల కేంద్రంలో 1986లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) స్థాపించారు. అయితే గిరిజనులకు ఏ పథకాలు అమలు చేయాలి, ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించాలనే ముందు చూపు చర్చలు చేపట్టేందుకు ప్రతీ మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించేవారు. ఇలా ప్రతీ మూడు నెలలకు ఒకసారి పాలకమండలి సమావేశం నిర్వహిస్తూ గిరిజనుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇతరత్రా సంక్షేమ ఫలాలను అందించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా ఐటీడీఏ పాలకమండలి సమావేశం మాత్రం ఆరేళ్లుగా నిర్వహించడం లేదు. దీంతో ఎప్పుడు నిర్వహిస్తారోనని గిరిజనులు ఎదురు చూస్తున్నారు.
ఏటూరునాగారం ఐటీడీఏలో 2019 డిసెంబర్ 19న ఐటీడీఏ పాలకమండలి సమావేశం నిర్వహించారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రి సత్యవతిరాథోడ్, పీఓ చక్రధర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు తర్వాత హనుమంత్ జెండగే, అంకిత్, ప్రస్తుతం చిత్రామిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ పాలకమండలి సమావేశంపై దృష్టి సారించడం లేదు. ఇదే కాకుండా స్థానికంగా మంత్రి సీతక్క ఉన్నప్పటికీ ఐటీడీఏ పాలకమండలి, గిరిజనాభివృద్ధిపై ఇప్పటి వరకు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం లేదని గిరిజనులు వాపోతున్నారు.
లక్షలాది రూపాయలు వృథా
ప్రతీ ఏడాది పాలకమండలి సమావేశం నిర్వహించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక బుక్‌లెట్లను వేసేవారు. అందులో ఐటీడీఏ బడ్జెట్, ఖర్చులు, బడ్జెట్ కేటాయింపు వివరాలను అందులో ప్రచురించి పాలకమండలి సమావేశానికి వచ్చే సభ్యులకు అందజేయాల్సి ఉంటుంది. కానీ పాలకమండలి సమావేశం నిర్వహించకపోవడంతో ఇలా రెండేళ్ల పాటు పుస్తకాలను అచ్చువేశారు. సమావేశం నిర్వహించకపోవడంతో ఆ పుస్తకాలు సైతం మూలకు పడేశారు.
బడ్జెట్ కేటాయింపులో అలసత్వం
ఐటీడీఏ స్వయం ప్రతిపత్తిని కలిగి ఐటీడీఏ కింద ఉన్న 13 ఏజెన్సీ మండలాల్లో గిరిజాభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించి ఖర్చు చేసి అ భివృద్ధి చేసేవారు. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులో ప్రభుత్వం అలసత్యం చూపిస్తుండడంతో ఎలాంటి పథకాలను అమలు చేయలేని దుస్థితి నెలకొంది. బడ్జెట్‌ను పలు పద్ధతుల్లో ఇచ్చేవారు. ఆర్టికల్ 275, ఎస్టీ సబ్‌ప్లాన్, ట్రైకార్ నిధులు రాకపోవడంతో పథకాల గురించి ఊసెత్తేవారే కరువయ్యారు.
ఐటీడీఏ పాలకమండలి సమావేశం మూడు నెలలకోమారు నిర్వహించాలి. నిర్వహించకపోవడంతో పరిపాలన సక్రమంగా సాగడం లేదు. పథకాలు సైతం పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. కేవలం నామమాత్రపు పథకాలు ఇవ్వడం తప్పా గిరిజనులకు ఒరిగింది ఏమిలేదు.
–కబ్బాక శ్రావణ్, ఆదివాసీ సంఘం
రాష్ట్ర నాయకుడు, ఏటూరునాగారం
ఐటీడీఏ ద్వారా గతంలో ఎకనామికల్ సపోర్ట్ స్కీం, డ్రైవర్ కమ్ ఓనర్, కుటీర పరిశ్రమలు, గిరిజనులకు ఉచిత శిక్షణ, ఉపాధి, ఉద్యాన పంటల సాగు, పనిముట్లు, గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పథకాలు అమలు చేయని పరిస్థితి నెలకొంది. 2020–21లో ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్‌ఎస్) బడ్జెట్ మంజూరు అయినప్పటికీ ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఫలాలను అందించలేదు. దీనివల్ల ఈఎస్‌ఎస్‌కు ఎంపికై న లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలను చేస్తున్నారు.
చివరిసారిగా 2019 డిసెంబర్ 19న నిర్వహణ
గిరిజనులకు అందని సంక్షేమ ఫలాలు


