రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
గోవిందరావుపేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గల సీపీఎం కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఎండీ గఫూర్ పాషా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో రైతులు 14 నెలల పాటు పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే చర్యలను చేపట్టిందన్నారు. దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు 500 బిలియన్ డాలర్ల విలువ చేసే రూ. 45 లక్షల కోట్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులకు తలుపులు తెరిచి సుంకాలను తగ్గించారని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలకు రూపకల్పన చేశారని వివరించారు. వీటికి వ్యతిరేకంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళనలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ఆదిరెడ్డి, యాకుబ్, చంద్రశేఖర్, సూర్యనారాయణ, సదానందం, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పోతినేని సుదర్శన్‌రావు


