సబ్సిడీ గ్యాస్ పక్కదారి
ఏజెన్సీల నుంచే నేరుగా సిలిండర్ల సరఫరా
రూ.లక్షల్లో దందా..
గోవిందరావుపేట: జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహకులతో కుమ్మకై ్క సబ్సిడీ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. వాస్తవానికి ఆయా ప్రదేశాల్లో వాణిజ్య అవసరాలకు వాడాల్సిన (కమర్షియల్) సిలిండర్ల స్థానంలో సబ్సిడీ గ్యాస్‌ను బహిరంగంగా వాడుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. కొన్ని హోటళ్లలో ఒకేసారి నాలుగైదు సిలిండర్లు వాడుతున్నారంటే గ్యాస్ దందా ఎలా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీలతో పాటు కొంతమంది మధ్యవర్తుల ద్వారా గృహ సిలిండర్లు హోటల్ యజమానులకు చేరుతున్నట్లు సమాచారం.
ఒక్కో సిలిండర్‌పై అదనపు వసూలు
ఈ దందాలో ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.150 నుంచి 200 వరకు అదనంగా వసూలు చేస్తూ వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా దందా సాగుతున్నా సంబంధిత పౌరసరఫరాల శాఖ గ్యాస్ విభాగం అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఇంటి అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధర రూ.925లు ఉండగా వాణిజ్య అవసరాలకు వాడే 19 కేజీల సిలిండర్ ధర రూ.1,858 ఉంది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో హోటల్, రెస్టారెంట్ల యజమానులు వాణిజ్య సిలిండర్లను ఉపయోగించకుండా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను ఏజెన్సీల నిర్వహకులకు అదనంగా డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు.
గ్యాస్ కనెక్షన్ల వివరాలు
జిల్లా వ్యాప్తంగా 8 ఏజెన్సీలు ఉండగా మొత్తం 1,00,200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లలో సింగిల్ 32,183, డబుల్ 15,798, దీపం పథకం కింద సింగిల్ 17,203, డబుల్ 2,947, సీఎస్‌ఆర్ పథకం కింద సింగిల్ కనెక్షన్లు 7,792, డబుల్ 702 ఉన్నాయి. పీఎంయూవై పథకం కింద సింగిల్ కనెక్షన్లు 21,153 ఉండగా డబుల్ 2,150 ఉన్నాయి. కమర్షియల్ కనెక్షన్లు మా త్రం కేవలం 272 మాత్రమే ఉండడం గమనార్హం.
ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గృహ గ్యాస్ సిలిండర్లు పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం అందిస్తోంది. వాటిని వాణిజ్య ప్రయోజనాలకు మళ్లించడం తీవ్రమైన నేరం. ఈ అంశంపై త్వరలోనే ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తాం. అక్రమంగా గృహ సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లు, నిబంధనలు అతిక్రమిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తప్పవు. అలాగే అధిక వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– రాంచందర్, డీటీసీఎస్, ములుగు
70 శాతం హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం
వాణిజ్య సిలిండర్లు వాడాల్సి ఉన్నా నిబంధనలు బేఖాతర్
జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు సుమారుగా వెయ్యికి పైగా ఉన్నాయి. వీటిలో 70 శాతం సబ్సిడీ సిలిండర్లే వాడుతున్నారు. ఏజెన్సీలకు చెందిన వాహనాల్లోనే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నా సంబంధిత అదికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీ సిలిండర్లను అక్రమంగా హోటళ్లు, రెస్టారెంట్లకు తరలిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.


