భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన దర్శనాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసులతో పాటు పూజారులకు, యువతకు ఉందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మేడారంలో సమ్మక్క– సారలమ్మ పూజారులు, మేడారం గిరిజన అభ్యుదయ యువతతో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎస్పీ మాట్లాడారు. ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు అమ్మవార్ల దర్శనం అయ్యేలా చూసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుగు ప్రయాణం అయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నేడు మండమెలిగే పండుగ నుంచి జాతర ముగిసే వరకు భక్తులు భారీగా తరలివస్తారని తెలిపారు. వారి రక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, ఎస్‌బీ సీఐ శంకర్, నార్లాపూర్ ఎస్సై కమలాకర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు, పూజారులు రమేష్, అరుణ్‌కుమార్, దశరథం తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


