విద్యుత్ అంతరాయానికి సహకరించాలి
ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్‌శాఖ ఏఈ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పత్తిపల్లి విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని పత్తిపల్లి, పొట్లాపూర్, చింతలపల్లి, అన్నంపల్లి, చిన్నగుంటూర్‌పల్లి, చింతకుంట, కొడిశలకుంట, పులిగుండం, సారంగపల్లి , జగ్గన్నపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ములుగు రూరల్: గతేడాది యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కోశాధికారి గుండబోయిన చంద్రయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం క్వింటాకు బోనస్ రూ.500 చెల్లిస్తుందనే ఆశతో రైతులు సన్నధాన్యం సాగు చేసి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సన్నధాన్యం సాగుకు ఖర్చు ఎక్కువగా ఉండడంతో పాటు దిగుబడి తగ్గుతుందని తెలిపారు. అలాగే వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 10వేలు చెల్లిస్తామని హామీనిచ్చి అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు యూరియా బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూరియా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాస రాజన్న, కామ రవి, ముక్కాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 1వ గనిలో విధులు నిర్వర్తిస్తున్న అడిచర్ల శ్రీనివాస్ కోల్ ఇండియా స్థాయి కూచిపూడిలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నాగ్‌పూర్‌లోని డబ్ల్యూసీఎల్ కంపెనీలో జరిగిన కోల్ ఇండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో శ్రీనివాస్ పాల్గొని ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం జీఎం కార్యాలయంలో శ్రీనివాస్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు శ్యాంప్రసాద్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
రేగొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాట నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ డీఈ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లూస్ లైన్స్, వంగిన పోల్స్‌ను సరి చేశారు. విద్యుత్ షాక్‌కు గురికాకుండా రైతులకు పలు జాగ్రత్తలను సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ వంగ రాజు, సిబ్బంది సురేష్, నాగరాజు పాల్గొన్నారు.
విద్యుత్ అంతరాయానికి సహకరించాలి


