ఇక మున్సిపల్ పోరు..
వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా..
ములుగు: మున్సిపల్ పోరుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇటీవల మున్సిపల్ తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ టీఎస్.దివాకర సమక్షంలో వార్డుల వారీగా డ్రా పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. మేజర్ పంచాయతీగా ఉన్న ములుగును జీవింతరావుపల్లి, బండారుపల్లి జీపీలను కలుపుకొని 2025 మే 29న మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో చైర్‌పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. తొలిసారిగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పుర చరిత్రలో నిలిచిపోనున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన ములుగులో అనుహ్యంగా ములుగు మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
మేజర్ పంచాయతీగా ఉన్న ములుగును 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లాగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాగా ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పటికీ తగినంత జనాభా, ఓటర్లు లేకపోవడంతో మున్సిపాలిటీ ఏర్పాటు కాలేదు. ములుగు మున్సిపాలిటీలో జీవింతరావుపల్లి, బండారుపల్లి జీపీలను కలిపి మున్సిపాలిటీగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో తొలిసారిగా జరగనున్న మున్సిపల్ పోరుకు 20 వార్డులను, 20 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పరిధిలో సుమారుగా 698 మంది ఓటర్లు ఓటు వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 20 వార్డుల పరిధిలో 13,963 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6,661 మంది పురుషులు, 7,300 మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. 20 వార్డులలో 2 ఎస్టీకి, 3 ఎస్సీలకు, 5 బీసీలకు, 10 జనరల్ అభ్యర్థులకు రిజర్వేషన్లు కేటాయించగా ఇందులో 10 మంది మహిళలకు 10 వార్డులను కేటాయించారు.
ములుగు మున్సిపల్ పోరుకు ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. బీసీ మహిళకు చైర్‌పర్సన్ పదవిని కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి వంగ సుమలత, మాజీ సర్పంచ్ బండారి నిర్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సకినాల భవానితో పాటు మాజీ ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి పోటీలో ఉంటున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీలో ప్రచారం సాగుతోంది. మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ఇరు పార్టీలకు చెందిన వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వారం రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు. తమను ఎలాగైనా గెలిపించాలని అవసరమైతే ఓటుకు రూ. 2 నుంచి 5 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓటర్లకు సంకేతాలు ఇస్తున్నారు.
వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు
తొలిసారిగా ములుగులో మున్సిపల్ ఎన్నికలు
20 వార్డుల పరిధిలో 13,963 మంది ఓటర్లు
చైర్‌పర్సన్ పీఠంపై బీసీ మహిళ
1వ వార్డు – ఎస్టీ మహిళ
2 – ఎస్సీ జనరల్
3 – జనరల్ మహిళ
4 – జనరల్ మహిళ
5 – ఎస్సీ మహిళ
6 – బీసీ జనరల్
7 – జనరల్
8 – జనరల్ మహిళ
9 – జనరల్ మహిళ
10 – జనరల్ మహిళ
11వ వార్డు – బీసీ జనరల్
12 – జనరల్
13 – ఎస్సీ జనరల్
14 – జనరల్ మహిళ
15 – బీసీ మహిళ
16 – జనరల్
17 – బీసీ జనరల్
18 – బీసీ మహిళ
19 – జనరల్
20 – ఎస్టీ జనరల్
ఇక మున్సిపల్ పోరు..


