ములుగు అడిషనల్ ఎస్పీ బదిలీ
ములుగు: ములుగు అడిషనల్ ఎస్పీ శివమ్ ఉపాధ్యాయ బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీగా ఏడాదికిపైగా విధులు నిర్వహించిన శివమ్ ఉపాధ్యాయ పదోన్నతిపై 2025 సెప్టెంబర్ 18న ములుగు అడిషనల్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగు నెలల వ్యవధిలోనే శివమ్ ఉపాధ్యాయను ప్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
చెట్లు, స్తంభాలకు రంగులు
ఏటూరునాగారం: మహాజాతర సందర్భంగా వచ్చిపోయే వాహనాలు, భక్తులకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, స్తంభాలు కనిపించే విధంగా ఆర్‌అండ్‌బీశాఖ ఎరుపు, తెలుపు గుర్తులతో ప్రతీ చెట్టుకు, స్తంభానికి కలర్ వేయించారు. దీంతో రోడ్డు వెంట ఏమి ఉన్నాయి, ఎంత దూరం వరకు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులకు, భక్తులకు రక్షణ కల్పించేలా ఈ రంగులు సహాయ పడనున్నాయి.
రాష్ట్రస్థాయి
ఖోఖో పోటీలకు ఎంపిక
మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని దామరకుంట సోషల్ వెల్ఫేర్ విదార్థిని మంతెన శ్రీహర్షిని ఎంపికై నట్లు పెద్దపెల్లి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.లక్ష్మణ్, వేల్పుల కుమారు తెలిపారు. ఈనెల 18 నుంచి 20 వరకు నారాయణపేట జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. విద్యార్థిని ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ నజ్మా, పీడీ రాజేశ్వరి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు.
గూగుల్ మ్యాప్ తప్పుదారి.. పర్యాటకులకు తిప్పలు
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం లక్నవరం సరస్సుకు వెళ్లే పర్యాటకులు గూగుల్ మ్యాప్ గందరగోళంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్‌లో లక్నవరం సరస్సు అని సెర్చ్ చేస్తే మేడారం నుంచి వచ్చే వాళ్లకు దుంపెల్లిగూడెం మీదుగా, వరంగల్ నుంచి వచ్చే వారికి జంగాలపల్లి క్రాస్ నుంచి కన్నాయిగూడెం గ్రామంలోకి చూపిస్తోంది. ఫలితంగా పర్యాటకులు 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు అదనంగా ప్రయాణించి, చివరకు దారి తప్పినట్లు తెలుసుకొని మళ్లీ వెనక్కి వస్తున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్టాల నుంచి వచ్చే వారికి స్థానిక మార్గాలపై అవగాహన లేకపోవడంతో గూగుల్ మ్యాప్‌పైనే ఆధారపడాల్సి వస్తోందని, ఈ క్రమంలో సమయం, ఇంధనం వృథా కావడంతో పాటు పర్యాటకుల మనోభావాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు గూగుల్ మ్యాప్‌లో లక్నవరం సరస్సు లొకేషన్ సరి చేయడంతోపాటు ప్రధాన రహదారులపై స్పష్టమైన దిశ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
ములుగు అడిషనల్ ఎస్పీ బదిలీ


