మేడారంలో ఘర్షణ
వరంగల్ క్రైం: మేడారంలో శనివారం ఓ పోలీస్ అధికారి, పూజారి కుటుంబం మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. మేడారానికి చెందిన సమ్మక్క వడ్డె పూజారి కుమారుడు చిలకలగుట్ట దారిలో ఇంటి వద్ద కొబ్బరికాయల దుకాణం ఏర్పాటు చేశాడు. కొబ్బరికాయలు వెనక్కి జరపాలని పూజారి కుమారుడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కొంత మంది పూజారులు సంబంధిత ఎస్సై స్థాయి అధికారికి వెళ్లి చెప్పేందుకు ప్రయత్నించగా సదరు ఎస్సై పూజారి వడ్డె కుమారుడిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఆగ్రహించిన పూజారులు సంబంధిత అధికారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో మేడారం విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని పూజారులతో మాట్లాడి గోడవను సద్దుమణిగేలా చేశారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారంలో ఇసుక లారీలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం లారీలు ఇరువైపులా పార్కింగ్ చేసి ఉండడంతో దామెరకుంట వైపు, చెన్నూర్, కాళేశ్వరం మీదుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.


