వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి వరపూజ
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు
● ప్రత్యేక పూజలు నిర్వహించిన
మంత్రి సీతక్క
మంగపేట: మండలంలోని మల్లూరులో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి వరపూజ మహోత్సవం (జాతర) గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేష్ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రవరా వరపూజ (పెళ్లిచూపులు) కార్యక్రమాన్ని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకష్ణమాచార్యుల బృందం, పూజారి ముక్కామల రాజశేఖర శర్మ వరపూజ మహోత్సవాన్ని వేదమంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామంలోని రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మూడు గంటల పాటు నేత్ర పర్వంగా కొనసాగింది. స్వామివారి ఇతి వృత్తాన్ని భద్రాచలం దేవస్థాన వ్యాఖ్యాత ఎస్టీజీ కృష్ణమాచార్యులు వివరించారు. వరపూజ మహోత్సవం సందర్బంగా స్వామివారికి ఆలయ ఈఓ మహేష్, పట్టువస్త్రాలను అందించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం, మల్లూరు శంభులింగేశ్వరస్వామి ఆలయ పూజారి అనిపెద్ది నాగేశ్వర్‌రావు పెద్దలుగా వ్యవహరించి స్వామివారు, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను అందచేశారు.
మే 1న తిరుకల్యాణం
మల్లూరుగుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో సంక్రాంతి సందర్భంగా ఆలయ అర్చకులు తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి వేద మంత్రోచ్ఛరణ నడుమ కై ంకర్యాదులు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ప్రతి ఏటా హేమాచల క్షేత్రంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు, మే 1న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు వివాహ సుముహూర్తాన్ని ఖరారు చేసి నిశ్చయ తాంబూలాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
హేమాచలున్ని దర్శించుకున్న మంత్రి సీతక్క
హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రేవెల్లి మహేష్, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే లక్ష్మీ నర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తహసీల్దార్ రవీందర్, టీఎస్‌ఈజీసీ సభ్యుడు గుమ్మడి సోమయ్య, మాజీ చైర్మన్ చిట్యాల పురుశోత్తం, యరంగారి సురేష్, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరిని ఆలయ ఈఓ మహేష్, అర్చకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు అయ్యోరి యానయ్య, చందర్లపాటి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి వరపూజ


