పరిశుభ్రతే లక్ష్యం
ఆధునిక యంత్రాల వినియోగం
మహాజాతరలో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు
సేకరించిన చెత్తను
ట్రాక్టర్‌లో వేస్తున్న కార్మికులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో తగిన చర్యలు చేపడుతున్నారు. ఈ సారి మహాజాతరకు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అధికారుల అంచనాతో జిల్లా పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో జాతరలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మహాజాతర సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంతంలో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి దింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ రోడ్లు, జంపన్నవాగు, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచనున్నట్లు చెబుతున్నారు.
జాతరకు 20 మంది డీపీఓలు
మేడారం మహాజాతరలో జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో విధుల నిర్వహణకు భారీ సంఖ్యలో అధికారులను, సిబ్బందిని నియమించనున్నారు. డీపీఓలు 20 మంది, డీఎల్‌పీఓలు 40 మంది, ఎంపీఓలు 120 మంది, పంచాయతీ కార్యదర్శులు 500 మందిని జాతరలో పారిశుద్ధ్య పనుల విధుల నిర్వహణకు నియమించనున్నట్లు డీపీఓ వెంకయ్య తెలిపారు. ముందస్తు జాతరలో చెత్త సేకరణ, శుభ్రత నిర్వహణ, దుమ్ము ధూళి సమస్యలు తలెత్తకుండా ముందస్తు పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మేడారంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన జాకెట్లు, మాస్కులు వంటి రక్షణ సామగ్రిని అందించేందుకు 9 మంది ఎంపీఓలు, 150 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మేడారం మహాజాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. భక్తులకు పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. గత జాతర కంటే ఈ సారి జాతరలో వెయ్యిమంది కార్మికుల సంఖ్యను పెంచాం. మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు, కలెక్టర్ దివాకర సూచనలు, సలహాల మేరకు జాతరలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. జాతరలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేయకుండా భక్తులు సహకరించాలి. – కొండ వెంకయ్య, డీపీఓ
●
ఈ సారి జాతరలో పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక యంత్రాలను వినియోగించనున్నారు. 150 ట్రాక్టర్లు, 5 వేల జాకెట్లు, 1.50 లక్షల మాస్కుల కొనుగోలు, 18 స్వీపింగ్ యంత్రాలు, 50 స్వచ్ఛ ఆటోలు, 20 బాబ్ క్యాట్లు, 20 జేసీబీలు, 40 డోజర్లు, 10 వ్యాక్యూమ్ క్లీన్ యంత్రాలు, 50 వాటర్ ట్యాంకులు, మహిళల కోసం 13 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖల నుంచి సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతరలో పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రజారోగ్య పరిరక్షణతో పాటు జాతర గౌరవాన్ని మరింత పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
మూడు షిఫ్టుల్లో పనులు
క్లీనింగ్‌కు భారీగా యంత్రాలు
పరిశుభ్రతే లక్ష్యం
పరిశుభ్రతే లక్ష్యం
పరిశుభ్రతే లక్ష్యం


