వైభవంగా గోదాదేవికి సారె..
మంగపేట: మండలంలోని కమలాపురం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గోదారంగనాయక మహిళా కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీకుమారాచార్యులు ఉదయం గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో కమలాపురం పాతూరులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి అమ్మవారికి పసుపు. కుంకుమ, పూలు, గాజులు, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం, వివిధ రకాల పిండి వంటలు, పండ్లు పట్టుకుని భక్తులు సతీసమేతంగా మంగళవాయిద్యాల నడుమ ఆటోస్టాండ్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకుకున్నారు. అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపించి సారెను సమర్పించారు. అనంతరం నిర్వహించిన కుంకుమ పూజలో గోదారంగనాయక మహిళా కమిటీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ పాల్గొని గోదాదేవి అనుగ్రహించి తమ కోరికెలను తీర్చాలని వేడుకుంటూ పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల గోత్రనామాలతో ఆలయ పూజారి ప్రత్యేక అర్చనలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేడు(మంగళవారం) గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు
వైభవంగా గోదాదేవికి సారె..


