విద్యాసంస్థల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
ములుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం సాయంత్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణంపై ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ వీసీలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో ఉంచేందుకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందన్నారు. జిల్లాల వారీగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తగు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాకు ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయగా సంబంధిత పాఠశాలకు భూమిని కేటాయించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు అదనపు కలెక్టర్ మహేందర్ జీ, మున్సిపల్ కమిషనర్ సంపత్ రావు, డీఈఓ సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.
వీసీలో ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టివిక్రమార్క


