గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ములుగు రూరల్ : ఆది దేవత గట్టమ్మ తల్లిని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మల దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో కొలువైన గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మైదాన ప్రాంతాల్లోనే
గాలిపటాలు ఎగురవేయాలి
ములుగు రూరల్ : మైదాన ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయాలని, విద్యుత్ వాహకం కలిగిన చైనా మాంజాను వినియోగించకూడదని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆనందం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా.. సురక్షితంగా సంక్రాంతి సంబురాలు నిర్వహించుకోవాలని ఆయన వివరించారు. గాలిపటాలు ఎగురవేయడం సాంప్రదాయంగా వస్తోందని, అలాంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయకూడదని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించిన 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
హేమాచలుడి
వరపూజకు ఆహ్వానం
మంగపేట : మల్లూరు హేమాచల క్షేత్రంలో ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవం (పెళ్లిచూపులు) కార్యక్రమానికి రావాలని ఈఓ రేవెల్లి మహేష్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ప్రతి ఏటా హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో
గణపేశ్వరుడు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. సెలవు రోజు కావడంతో విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొని కోటగుళ్ల శిల్ప సంపదను తిలకించారు.
ఎలుగుబంటి వేషంతో
కోతులు పరార్
చిట్యాల : చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పంటలను కోతులు నష్టపరుస్తున్నాయి. ఇంట్లోకి కూడా వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతుల బాధనుంచి ఉపశమనం కోసం రైతు శనివారం ఎలుగుబంటి వేషం వేసి కోతులను తరిమి కొట్టాడు. దీంతో కోతులు అక్కడినుంచి పారిపోయాయి. రైతు వేషాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు


