జాతరలో మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్ : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో సిద్ధమయ్యారు. గత జాతర అనుభవాల దృష్ట్యా భక్తులకు వైద్య సేవలు కల్పించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. భక్తులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ములుగు జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వసతుల కల్పన చేపట్టారు.
టీటీడీ కల్యాణ మండపంలో ప్రధాన ఆస్పత్రి
మేడారం గద్దెల పరిసరాల్లోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ప్రధాన ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు జంపన్నవాగు, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆరు పడకల సామర్థ్యంతో రెండు మినీ ఆస్పత్రులు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స, గుండెపోటు, ప్రమాదాలు జరిగిన సమయంలో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు వీలుగా 35 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.
8 రూట్లలో 42 రూట్ క్యాంపులు
8 ప్రధాన రహదారుల్లో భక్తులకు సేవలు అందించేందుకు 42 రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ నుంచి మేడారం రూట్‌లో 9 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే రూట్‌లో ఆరు, భద్రాచలం రూట్‌లో ఐదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
3,199మంది వైద్య సిబ్బంది
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన 3,199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది మహిళా వైద్యులు, 544 మంది వైద్యులు విధులు నిర్వహించడంతో పాటు 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు వైద్యసేవలు అందించనున్నారు.
జనవరి 25 నుంచి పూర్తిస్థాయిలో..
జనవరి 25వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు ప్రాంభించనున్నారు. శిబిరాల్లో 248 రకాల మందులు, సర్జికల్ సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. ప్రణాళికా బద్ధంగా వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ ఉండనుంది.
మేడారంలో 3 ఆస్పత్రులు,
30 మెడికల్ క్యాంపులు
42 రూట్ క్యాంపులు, 35 అంబులెన్స్‌లు
విధులు నిర్వహించనున్న 3,199 మంది సిబ్బంది
జాతరలో మెరుగైన వైద్యసేవలు


