హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీనర్సింహ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామి వారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. భక్తుల గోత్రనామాలతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేదాశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా మారింది.
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి


