ములుగు జిల్లా జోలికొస్తే ఖబడ్దార్..
● బడే నాగజ్యోతి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్రలో భాగంగా ములుగు జిల్లాకు కూడా ప్రమాదం పొంచి ఉందని, ములుగు జిల్లా రద్దుకు కుట్ర చేస్తే సహించేదిలేదని బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ములుగు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నా రు. ములుగు జిల్లా జోలికొస్తే జిల్లా ప్రజల తిరుగుబాటును ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు వేములపల్లి భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గండి కుమార్, గోర్రె సమ్మయ్య, బైకాని సాగర్, మాదం సాగర్, దూడబోయిన శ్రీను, రఘు, రాణా ప్రతాప్, పోరిక శ్యామల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


