పునరుద్ధరణ రెండోదశ పనులు షురూ
హన్మకొండ కల్చరల్: హైదరాబాద్ సర్కిల్ భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో వేయిస్తంభాల ఆలయం కల్యాణ మండపం పునరుద్ధరణలో భాగంగా రెండో దశ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నిఖిల్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలాజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ హెచ్‌ఆర్ దేశాయ్ పాల్గొని పూజలు నిర్వహించి కళ్యాణ మండపం పైకప్పు వాటర్ ప్రూఫింగ్ పనులు ప్రారంభించారు. ప్రస్తుత ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 32 లక్షలు కాగా, 90రోజుల్లోపు పూర్తయ్యేలా వాటర్ ప్రూఫింగ్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం కళ్యాణ మండపం దక్షిణ భాగం రీసెట్టింగ్ పనులను ఏఎస్‌ఐ చేపట్టనుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, నిట్ విశ్రాంతాత ఆచార్యులు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, కన్జర్వేషన్ అసిస్టెంట్లు మల్లేశం, అజిత్, దేవాదాయశాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.


