రిజర్వేషన్‌పై ఉత్కంఠ..!
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండటంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో తొలిసారిగా ములుగు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో రిజర్వేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 14,112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,731 మంది పురుషులు 7,379 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఓటరు ముసాయిదాను విడుదల చేసిన సంబంధిత అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 12న ఓటరు తుది జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాలను టీ పోల్ యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. తొలిసారిగా ములుగులో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుండడంతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ ఇప్పటికే పావులు కదుపుతుండగా, మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది.
ఇప్పటికే గ్రౌండ్ వర్క్..
కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఆయా వార్డుల్లో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు వార్డులపై దృష్టి పెట్టారు. ఏ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే అక్కడినుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనం మధ్యనే ఉంటున్నారు. ఆయా కాలనీల్లో ఏదైనా సమస్యను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతూ.. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇలా ఎన్నికలకు ముందే ప్రజల మన్ననలు పొందాలని ఆశావహులు ఉత్సాహంగా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఆశావహుల్లో టెన్షన్
మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ములుగు ఎస్టీ నియోజవర్గం కావడంతో ఎస్టీ రిజర్వేషన్‌కు కేటాయిస్తారా.. ఇతర సామాజిక వర్గాలకు కేటాయిస్తారా.. అనేది సందేహంగా మారింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపు ఏ పద్ధతిలో ఉంటుంది.. 42 శాతం కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని ఆశావహులు జోరుగా చర్చించుకుంటున్నారు. తమకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలువురు అదినాయకుల వద్ద క్యూ కడుతున్నట్లు సమాచారం.
కీలకంగా మారనున్న చైర్మన్ స్థానం
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానం రిజర్వేషన్ కీలకంగా మారనుంది. ఈ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలోని ప్రధాన నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా కుర్చీని దక్కించుకొని తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు అధికార పార్టీతోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
12న వార్డుల వారీగా
ఓటరు తుది జాబితా విడుదల
రిజర్వేషన్‌పై ఉత్కంఠ..!


