కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ అన్నారు. బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ పాఠశాలను శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ రాజేశ్ శర్మ, రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అశిష్ కోహ్లి, డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ అమర్జీత్ శర్మ, ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఒకేషనల్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయాలని రూ.10 వేలను ప్రిన్సిపాల్ దేవకి కి అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్థ్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు అర్షం రాజు, శ్యాంసుందర్‌రెడ్డి, సాంబయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రామప్ప శిల్పకళ బాగుంది..
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి మంత్రి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి శాలువాలతో వారిని సత్కరించారు. అనంతరం ఆలయ విశిష్టత, శిల్పకళా ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. వారివెంట అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.


