‘ఆపరేషన్ స్మైల్’తో.. బాలలకు భరోసా
● 2019 నుంచి 854 మంది బాలకార్మికులకు విముక్తి
● పాఠశాలల్లో చేర్పిస్తున్న అధికారులు
జిల్లాలోని పది మండలాల్లో దాడులు నిర్వహించి గుర్తించిన బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాం. అంతేకాకుండా బాల కార్మికుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. లేబర్ యాక్టు ప్రకారం యజమానులు శిక్షకు అర్హులు. ప్రతీఏడాది జనవరి, జూలైలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి.
– తుల రవి, జిల్లా సంక్షేమశాఖ అధికారి
ములుగు రూరల్: వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు హోటళ్లు, కిరాణం దుకాణాలు, ఇటుకబట్టీలు, బైక్ మెకానిక్ షాపుల వద్ద పనులు చేస్తున్న వారిని గుర్తించి వెట్టిచాకిరి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అధికారులు ప్రతిఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్, మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్, చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18 ఏళ్ల లోపు పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు.
854 మంది చిన్నారులకు విముక్తి
జిల్లాలోని పది మండలాల పరిధిలో ప్రతీ ఏడాది జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను అధికారులు 2014 నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు 854 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించి పాఠశాలల్లో చేర్పించారు. బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇటుకబట్టీలు, క్రషర్లలో పనుల నిమిత్తం వచ్చిన కార్మికుల పిల్లలను అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాల కార్మికులను గుర్తించిన, బడీడు పిల్లలను బడిలో చేర్పించకుండా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలకు పంపించేందుకు అంగీకార పత్రాలను రాయిస్తున్నారు.
సంవత్సరం నెల బాలకార్మికులు
2019 జనవరి 19
జూలై 58
2020 జనవరి 138
జూలై 30
2021 జనవరి 190
జూలై 47
2022 జనవరి 129
జూలై 30
2023 జనవరి 32
జూలై 32
2024 జనవరి 63
జూలై 33
2025 జనవరి 47
జూలై 02
2026 జనవరి 04
‘ఆపరేషన్ స్మైల్’తో.. బాలలకు భరోసా
‘ఆపరేషన్ స్మైల్’తో.. బాలలకు భరోసా


