నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి
ములుగు: జిల్లాలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 ఏళ్ల లోపు బాలలకు సంబంధించిన కేసుల విచారణను నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని, పొడిగించదగిన సహేతుకమైన కారణాలుంటే గరిష్టంగా 6 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో బాలరక్ష భవన్ ప్రాంగణంలో బాలల న్యాయ మండలిని (జేజేబీ) ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీపీఓ రమణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చట్టంతో విబేధిస్తున్న పిల్లల కేసుల సత్వర పరిష్కారమే బాలల న్యాయ మండలి ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రతీ మూడు నెలలకోసారి ఈ కేసుల స్థితిని హైకోర్టు డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ సమీక్షిస్తారని పేర్కొన్నారు. పిల్లలకు పోలీస్, కోర్టు, జడ్జి అనే భావన రాకుండా అధికార యంత్రాంగం డ్రెస్ కోడ్ లేకుండా సివిల్ డ్రెస్‌లో, పిల్లలకు స్నేహాపూర్వకమైన వాతావరణంలో కేసుల విచారణ ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు ద్వారా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని బోర్డు ముందుకు వచ్చే పిల్లల్లో పరివర్తన తీసుకొచ్చి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్హయ్యలాల్, జిల్లా బాలల న్యాయ మండలి మెజిస్ట్రేట్ గుంటి జ్యోత్స్న, జిల్లా సంక్షేమాధికారి తుల రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధుళిక తేజ, జేజేబీ సోషల్ వర్కర్ మెరుగు సుభాశ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలాచారి, భిక్షపతి, న్యాయవాదులు రాంసింగ్, శంకర్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ


