భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోని సమ్మక్కతల్లి కొలువైన చిలకలగుట్ట ప్రాంతాన్ని సీతక్క అధికారులతో కలిసి బుధవారం సందర్శించారు. గుట్ట పైనుంచి అమ్మవారిని పూజారులు తీసుకొచ్చే దారిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జంపన్నవాగు, ఊరట్టం కాజ్‌వే ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరణ పనులు, రాతి స్తంభాల అమరిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్చి పిల్లర్లు ప్రాకారం పనులన్నీ రేపటి కల్లా పూర్తి చేయాలన్నారు. సీఎం రేవంతర్‌రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలన చేసి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేయాలని సీతక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.
హేమాచలుడి వరపూజకు రావాలని
మంత్రికి ఆహ్వానం
మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవానికి రావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ఆహ్వానిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ మూర్తులకు మల్లూరు గ్రామంలో వరపూజ మహోత్సవం(పెళ్లిచూపులు) నిర్వహించడం ఆనవాయితీ. వైభవంగా జరిగే స్వామివారి వరపూజ మహోత్సవానికి రావాలని కోరుతూ బుధవారం మేడారం వచ్చిన మంత్రి సీతక్కను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణికి ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ మహేశ్ అందజేశారు. అనంతరం ఆహ్వాన కరపత్రాలు, వాల్ పోస్టర్లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


