రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో? | - | Sakshi
Sakshi News home page

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?

Jan 6 2026 7:15 AM | Updated on Jan 6 2026 7:15 AM

రోడ్ల

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో? రెడ్డిగూడెం గ్రామస్తుల ఆందోళన

మేడారం జాతర సమయం సమీపిస్తున్నా పూర్తికాని పనులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనుంది. జాతర సమయం సమీపిస్తున్నా ఇంకా రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. వనదేవతల దర్శనానికి వచ్చే వాహనాల దారి మళ్లింపులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఒకే రోజున సుమారుగా 2 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. మేడారం ప్రధాన దారుల్లో రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మేడారానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లోగా రోడ్ల నిర్మాణం పనులన్నీ పూర్తి కాకపోతే భక్తులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సూచిక బోర్డులు నిల్‌..

వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తుల వాహనాలను అధికారులు దారి మళ్లిస్తుండడంతో ప్రయాణ దూరం పెరగడంతో పాటు సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. పస్రా నుంచి వచ్చే భక్తుల వాహనాలను దారి మళ్లించి నార్లాపూర్‌ చెక్‌ పోస్టు నుంచి పంపిస్తున్నారు. ఇలా తిరిగి రావడం వల్ల మేడారం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల దూరం ఎక్కువగా ఉంటుందని భక్తులు వాపోతున్నారు. అలాగే కొత్తూరులో సీసీ రోడ్ల నిర్మాణం పనుల కారణంగా చెక్‌పోస్టు నుంచి కాల్వపల్లికి వెళ్లే దారిలోని మార్గ మధ్య నుంచి అటవి మార్గంలో కన్నెపల్లి మీదుగా వాహనాలను పంపిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దారి మళ్లింపుతో గంటల తరబడి ఆలస్యం అవుతుందని భక్తులు వాపోతున్నారు.

అక్కడక్కడా అసంపూర్తిగా పనులు

మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు అతుకులు గతుకులుగా సాగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం పనులను మధ్యమధ్యలో అర్ధాంతరంగా వదిలేయడంతో మేడారం ప్రాంతవాసులతో పాటు భక్తులు అవస్థలు పడుతున్నారు. మేడారంలో ప్రధానంగా స్కేపింగ్‌ ల్యాండ్‌, చిలకలగుట్ట జంక్షన్‌ వద్ద రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి గద్దెల వద్దకు వచ్చే దారిలో జంక్షన్‌ వద్ద సీసీ రోడ్డు నిర్మించారు. కాని ర్యాంపు వేయకపోవడంతో వాహనాలు కిందకు దిగే పరిస్థితి లేదు. దీంతో వెనుతిరిగి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామానికి చెందిన దారికి అడ్డంగా కంకర పోసి వాహనాలు వెళ్లకుండా చేశారని మేడారం సమీపంలోని రెడ్డిగూడెం గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. జంపన్నవాగు నుంచి వచ్చే దారిలో రెడ్డిగూడెంలోకి వెళ్లే సీసీ రోడ్డు దగ్గర వాహనాల రాకపోకలు సాగకుండా కంకర కుప్పలు పోశారు. అంతేకాకుండా జంపన్నవాగు నుంచి వచ్చే బీటీ రోడ్డు వద్ద డివైడర్‌ నిర్మించారు. దీంతో హరితహోటల్‌ నుంచి రెడ్డిగూడెంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు, రోడ్డు కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామస్తులు ఆందోళన చేస్తుండగా పోలీసులు వచ్చి దారి సమస్యను తక్షణమే పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

వనదేవతల దర్శనానికి

భారీగా తరలివస్తున్న భక్తులు

వాహనాల దారి మళ్లింపులతో

తప్పని తిప్పలు

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?1
1/2

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?2
2/2

రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement