నేటినుంచి విద్యుత్ ప్రజాబాట
హన్మకొండ : వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి(మంగళవారం)నుంచి ప్రజాబాట ద్వారా వినియోగదారుల ముంగిటికి వెళ్లనుంది. పొలంబాట ద్వారా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు చేరుకుని నేరుగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధానాలు కొనసాగుతుండగానే కొత్తగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
ప్రతి మంగళ, గురు, శనివారాల్లో..
ఆయా సెక్షన్ పరిధిలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారులనుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు, నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వీరి సమక్షంలో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకుంటారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. సెక్షన్ స్థాయిల ఏఈల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్.ఈ, డీఈ, ఏడీఈలు అందరూ ఒకేచోట పాల్గొనవద్దని ఆదేశాలున్నాయి. ఒక కార్యక్రమంలో ఎస్‌ఈ పాల్గొంటే మరో కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్, మరో కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్గొంటారు. ఇలా సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఉన్నతాధికారులు మూడు సెక్షన్‌లలో నిర్వహించే ప్రజా బాటలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీరితో పాటు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొనే అవకాశముంది. నేటి (మంగళవారం)నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన
సమస్యల గుర్తింపు,
అప్పటికప్పుడు పరిష్కారం
ప్రతి సెక్షన్‌లో వారానికి మూడు రోజులు


