మహాజాతరను విజయవంతం చేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి జోనల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం మహాజాతర విజయవంతం చేయడంలో జోనల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. జోనల్ అధికారులు సెక్టార్ అధికారులతో కలిసి తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. జోనల్, సెక్టార్, వివిధ శాఖల అధికారులకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మూడు షిఫ్టులవారీగా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రతీ జోనల్‌లో తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చూసుకోవాలన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు.
దుకాణాల మార్పునకు చర్యలు
మేడారంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను నిర్ధేశిత స్థానాలకు వెనక్కి మార్పించే కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్ సోమవారం రాత్రి సమన్వయంతో అమలు చేశారు. జాతర సమయంలో రహదారులపై విపరీతమైన భక్తుల రద్దీ, వాహనాల గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున రోడ్డు నుంచి 12 అడుగుల దూరంలోనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు వ్యాపారులకు సూచించారు. అధికారులు వ్యాపారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి మేడారం జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భక్తులు సురక్షితంగా రాకపోకలు, వాహనాలు సాఫీగా నడిచేలా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. వ్యాపారులు అధికారుల సూచనలను అర్ధం చేసుకొని సహకరించడంతో రహదారి విస్తరణ సక్రమంగా సాగడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గం సుగమమైందని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.


