సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
● రాష్ట్రస్థాయికి పలువురి ఎంపిక
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను మండల పరిధిలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 18న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజేందర్‌రెడ్డి, పీఈటీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏటూరునాగారం మండలానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు అథ్లెటిక్స్ కోచ్ పర్వతాల కుమారస్వామి, కరిష్మా తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. మెడల్స్ సాధించిన వారిలో సంజన, ఎం.వైష్ణవిదేవి, కార్తిక్, బీమయ్య, ప్రణీత్ ఉన్నారు.


