పవర్ జనరేట్ హుళక్కేనా?
సమ్మక్క బ్యారేజీకి ఆనుకొని పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రూపకల్పన
ఏటూరునాగారం: గోదావరి నదిపై నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 2019లో సమ్మక్క బ్యారేజీకి ఆనుకొని పవర్ జనరేట్ ప్రాజెక్టు ఏర్పాటుకు రూపకల్పన చేశారు. పాలకులు, జెన్‌కో అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి తయారీ హుళక్కేనా అన్నట్లుగా మారింది. పవర్ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో సమ్మక్క బ్యారేజీకి సమీపంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు సివిల్ వర్క్‌ను పూర్తి చేశారు. డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును సైతం జెన్‌కోకు సమర్పించి ఆరేళ్లు అవుతుంది. అయినా ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది.
59 గేట్లు మూసివేస్తే..
6.5 టీఎంసీల నీరు నిల్వ
12 టర్బెన్లను అమర్చి 250 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ జనరేట్ ప్రాజెక్టుపై గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు బ్యారేజీలోని 59 గేట్లు మూసివేస్తే 6.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. గోదావరిలో ప్రవహించే నీటితో హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి పవర్ జనరేట్ చేసే విధంగా టర్బన్స్ ఇతర పనిముట్లను అమర్చాల్సి ఉంది. దీంతో తయారయ్యే విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు తరలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి 250 మెగావాట్ల విద్యుత్‌ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు.
హైడల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపని జెన్‌కో
గోదావరిలో ప్రవహించే జలాలతో హైడల్ ప్రాజెక్టును పూర్తి చేసి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో రూ.3 వేల కోట్లను పవర్ జనరేషన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ దానిపై అధికారులు మొగ్గుచూపడం లేదు. కన్నాయిగూడెంలోని ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పూర్తి అయినపప్పటికీ అందులో పవర్ ప్లాంట్‌ను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ జనరేట్ చేసేందుకు అనువైన స్థలం, నీటి సామర్ధ్యం ఉన్నా కూడా జెన్‌కో అధికారులు ఆసక్తి చూపకపోవడం, పాలకులు పట్టించుకోకపోవడం ఏజెన్సీ ప్రజలకు శాపంగా మారింది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజీ పక్కనే ఉన్న పవర్ జనరేషన్ ప్లాంట్‌పై దృష్టి సారించి పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి తయారీ పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సివిల్ వర్క్ పూర్తిచేసి డీపీఆర్ అందజేత
ఆరేళ్లు అయినా పట్టించుకోని జెన్‌కో అధికారులు


