బైక్, టాటాఏస్ ఢీ
ఏటూరునాగారం/వాజేడు/మంగపేట: బైక్, టాటాఏస్ ఢీ కొన్నాయి. ఈ క్రమంలో టాటాఏస్ ట్రాలీ, మిల్లర్ బోల్తా పడగా ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వాజేడు మండల పరిధిలోని మండపాక వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై జక్కుల సతీష్ కథనం ప్రకారం..
మంగపేట మండల పరిధిలోని కమలాపురానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు వాజేడులోని పూసూరులో స్లాబ్ సెంట్రింగ్ పనులు, స్లాబ్ కాంక్రీట్ పనులు ముగించుకొని టాటాఏస్‌లో 15 మంది కార్మికులు సామగ్రితో ఏటూరునాగారం వైపు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మండపాక వద్ద మంగపేటకు చెందిన గుగ్గిళ్ల సూర్యనారాయణ తన బైక్‌పై వచ్చి కార్మికుల వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఏఎస్ వాహనం తిరగపడింది. ఈ క్రమంలో కమలాపురంలో నివాసం ఉంటున్న కార్మికుడు ఛత్తీస్‌గఢ్ వాసి బొజ్జ ఏసు(30)పై సెంట్రింగ్ పనిముట్లు మీదపడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహన దారుడు సూర్యనారాయణ, టాటాఏస్ డ్రైవర్ సూరితో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన క్షతగాత్రులను వరంగల్, ములుగుకు రెఫర్ చేసినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. పొట్ట కూటికోసం భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదం బారిన పడగా పలువురి కాళ్లు ,చేతులు విరిగిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఒకరి మృతి.. ఎనిమిది మందికి గాయాలు


