మేడారం జాతర పవిత్రతను కాపాడాలి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఎస్‌ఎస్ తాడ్వాయి: ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపుదిద్దుకుంటుందని, జాతర పవిత్రతను కాపాడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. మేడారంలోని హరిత హోటల్‌లో సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలన్నారు. జాతర నిర్వహణపై ఆదివాసీ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసం మేడారం జాతర కలకలాం గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వలంటరీ సభ్యులకు, మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీల రవాణాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలనే అంశంపై ప్రత్యే క రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీఎఫ్‌ఓ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


