మేడారంలో విత్తన పండుగ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో పూజారులు విత్తన పండుగ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క పూజారులు, స్థానిక ఆదివాసీలు గ్రామంలోని గ్రామ దేవతలను పసుపు, కుంకుమలతో అలకరించి కంకణాలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో పూజారుల కుటుంబీకులు, గ్రామస్తులు వన భోజనలకు వెళ్లారు. వనంలో కొత్త పందిరి వేసి పసుపు, కుంకుమలు, సార ఆరగించి ప్రకృతి దేవతలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు, ఆదివాసీ పెద్దలు విత్తనాలు నాటేందుకు ముందుగా వర్షాలు ఏ కార్తెలో బాగా కురుస్తాయని కొత్త మట్టి కుండలో నీటిని పోసి ఒక్కొక్క కార్తె పేరు చెబుతూ ఇప్పపూలను వదులుతారు. నీటిలో ఇప్పపువ్వు తేలితే వర్షాలు అనుకూలంగా కురుస్తాయని ఆదివాసీలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయంగా విత్తన పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పూజారులు తెలిపారు. అనంతరం వనంలో చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. విత్తన పండుగతో మేడారంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, మహేశ్, భోజరావు, సిద్ధబోయిన రమేష్, సిద్ధబోయిన స్వామి, వసంతరావు, దశరథం, గ్రామస్తులు పాల్గొన్నారు.


