‘కాళేశ్వరం’ బస్టాండ్ నిర్మాణంపై రగడ
కాళేశ్వరం: కాళేశ్వరంలో బస్టాండ్ నిర్మాణంపై రగడ జరుగుతోంది. రెవెన్యూ, అటవీశాఖ మధ్య సమన్వయం లోపించినట్లు కనిపిస్తోంది. ప్రజా అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసింది. అప్పటి నుంచి అటవీశాఖ తమ ఫారెస్టు భూమి అంటూ అడ్డు తగులుతోంది.
మంత్రి చొరవతో..
కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌భాబు ప్రత్యేక దృష్టితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో బస్టాండ్ నిర్మాణానికి రూ.3.96కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో గోదావరి నదికి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో బస్టాండ్ నిర్మాణం జరగాలని ఆలోచన చేస్తున్నారు. అత్యాధునికంగా నిర్మాణం చేయాలని, అవసరమైతే డిపో నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
కొద్దిపాటి స్థలంతో..
ప్రస్తుతం కాళేశ్వరంలో బస్టాండ్ చిన్నపాటి స్థలంలో ఉంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులు ఇతర చోట స్థలం కావాలని రెవెన్యూ అధికారులకు విన్నపించారు. దీంతో రెవెన్యూ అధికారులు కాళేశ్వరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలోని 129 సర్వేనంబర్‌లో 4.24 ఎకరాల స్థలం ఆర్టీసీకి అప్పగించారు. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఆర్టీసీ డీఎం ఇందు, అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ సమాయత్తం అవుతున్నారు. మట్టిపరీక్షలు చేపట్టడానికి బుధవారం ఆర్టీసీ అధికారులు, ఇంజనీర్లతో కలిసి తరలివచ్చారు. అటవీశాఖ రేంజర్ రవికుమార్, ఫారెస్టు సెక్షన్ అధికారి ఆనంద్, మమత సిబ్బందితో వచ్చి తమ భూమి అంటూ అడ్డుకున్నారు. తహసీల్దార్ రామారావు, డీటీ కృష్ణ వారితో వాదించినా ససేమిరా అన్నారు. ఇరు శాఖలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు మట్టి పరీక్షలు సేకరించారు.
రూ.3.96కోట్లు
మంజూరు చేసిన ప్రభుత్వం
అటవీ, రెవెన్యూశాఖల సమన్వయలోపం
ఎట్టకేలకు మట్టి పరీక్షలు చేసిన
ఆర్టీసీ అధికారులు


