పది రోజుల్లో రైతులకు నష్టపరిహారం
ములుగు/ వాజేడు: బాండ్ మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయిన రైతులకు పది రోజుల్లో నష్ట పరిహారం డబ్బులు అందిస్తామని సీడ్ కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో హైటెక్ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లు రైతులతో కలిసి వ్యవసాయ శాఖాధికారులు నష్టపరిహారం చెల్లింపు ఒప్పంద సమావేశాన్ని నిర్వహించారు. వెంకటాపురం(కె) మండలం నుంచి 116 మంది, వాజేడు మండలం నుంచి 95 మంది , కన్నాయిగూడెం మండలం నుంచి ముగ్గురు రైతులకు పంటకాలంలో చేపట్టిన ఫీల్డ్ రిపోర్ట్ ఆధారంగా రూ.65 వేల నుంచి 85 వేల వరకు నష్ట పరిహారం కింద ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడు మండలాల్లో మరింత మంది రైతులు నష్ట పోయినప్పటికీ ఆర్గనైజర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారిని పరిగణలోకి తీసుకోలేదు. పంట నష్టపోయినట్లు అధికారులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా సదరు రైతుల నష్ట పరిహారం విషయంపై వ్యవసాయ అధికారులు, రైతులు, సదరు కంపెనీ ప్రతి నిధులతో ఏకీభవించారు. దీంతో పది రోజుల్లో డబ్బులను సదరు రైతులకు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధులు అంగీకరించడంతో ఒప్పంద పత్రాలపై రైతులు సంతకాలు చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ డీఏఓ అవినాష్ వర్మ, వాజేడు, కన్నాయిగూడెం ఏఓ ముంజ మహేష్, వెంకటాపురం(కె) ఏఓ నవీన్, ఆర్గనైజర్ సురేష్‌బాబు, కంపెనీ ఉద్యోగి అబుబాకర్ రైతు సంఘాల నాయకులు కొర్స నర్సింహమూర్తి, నాగరాజు, రాంబాబు, రైతులు పాల్గొన్నారు.
హైటెక్ కంపెనీ ప్రతినిధుల ఒప్పందం


