‘వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కేజీబీవీలో వేసవి శిబిరాన్ని వారు ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆటలు, పాటలతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, గణిత సమస్యలను వేగంగా సాధించడం, యోగ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేజీబీవీ విద్యార్థులే కాకుండా జిల్లాలోని 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు శిబిరంలో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ గ్యాదరి రమాదేవి, సమ్మర్ క్యాంపు కో ఆర్డినేటర్ జయ వసంతలక్ష్మి, సహాయ కోఆర్డినేటర్ జీవనప్రియ, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్, రిసోర్స్‌పర్సన్లు నరసింహా, రాజశేఖర్, నిరంజన్‌రెడ్డి, హరిత పాల్గొన్నారు.


