ఓరుగల్లు పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు
ములుగు: కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం, గణపురం కోటగుళ్లు, లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, బొగత జలపాతం, మేడారం జాతర, అభయారణ్యాలు చూసి తనివితీరా ఆస్వాధించవచ్చని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఓరుగల్లు పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు ఉందని వెల్లడించారు. సోమవారం తన ఛాంబర్‌లో టూరిజం అధికారులతో కలిసి పర్యాటక శాఖ రూపొందించిన బ్రోచర్ (వాల్ పోస్టర్)ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్‌గా చేయడానికి ఔత్సాహికులకు పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి పర్యాటక ప్రదేశాల సమాచారంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా 3 ఫొటోలు, 60 సెకన్ల వీడియో, వంద పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా ఎంట్రీలను పంపాలని సూచించారు. అందులో హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ, వసతి తదితర వివరాలను తెలియజేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇస్తామని వివరించారు. పది మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు. సంక్రాంతి రోజున కై ట్ ఫెస్టివల్‌లో బహుమతులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీపీఆర్‌ఓ రఫిక్, టూరిజం అధికారి కుసుమ సూర్య కిరణ్ పాల్గొన్నారు.
యాసంగికి సరిపడా యూరియా
జిల్లాలో యాసంగి (రబీ) సీజన్‌లో పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టీఎస్.దివాకర పేర్కొన్నారు. కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల పంపిణీ సాఫీగా జరిగేలా ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలలో యూరియా సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని, పంటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుకు యూరియా అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలో 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరమున్నట్లు గుర్తించమన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 9,945 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని వివరించారు. మరో 2,381 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. యురియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. పంపిణీ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
పర్యాటకశాఖ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్


