ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ శివారులో ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే..ఆలుబాక శివారులో రోడ్డుపక్కన ఇసుక లారీలు పార్కింగ్ చేయడంతో బస్సులు, ద్విచక్రవాహనదారులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా సోమవారం మధ్యాహ్నం చర్ల వైపు నుంచి వస్తున్న ధాన్యం లారీ, వెంకటాపురం వైపు నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ మూడు ఒకే వరుసలోకి వచ్చి చేరడంతో బస్సు చిక్కుకుపోయింది. ఈ క్రమంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో హమాలీలు, కార్మికులు లారీలో ఉన్న బస్తాలను తొలగించి బస్సు, లారీ వెళ్లేలా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇప్పటికై నా అధికారులు రోడ్డు పక్కన లారీలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


