చలికాలం.. జాగ్రత్త
ప్రశ్న: గుండె సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
– మల్లేశ్, వెంకటాపురం(కె)
పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
ములుగు రూరల్: జిల్లాలో కొద్ది రోజులుగా పెరిగిపోతున్న చలితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు సూచించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు పాటించాలన్నారు. లేదంటే రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో దగ్గు, జలుబు, జ్వరం బారిన పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. చలిగాలుల కారణంగా వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. చలిగాలి తగలకుండా మాస్క్‌లు, స్వెటర్లు ధరించాలని వివరించారు. చలికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షి సోమవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు పలు సూచనలు చేశారు.
ప్రశ్న: చలితో వచ్చే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపండి?
– కందకట్ల రణధీర్, మల్లంపల్లి
డీఎంహెచ్‌ఓ: చలి తీవ్రత కారణంగా తరుచూ జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అస్తమ, నిమోనియా, గుండె సమస్యలు తలెతుత్తాయి. చలికాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం సగం వరకు తీవ్రత ఉంటుంది. ఉదయం 7 గంటల కంటే ముందుగా చలిలో తీరగకూడదు. సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లోకి వచ్చే విధంగా చూసుకోవాలి. దగ్గు, జలుబు వస్తే భయపడాల్సిన పనిలేదు. ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మూడు రోజులు గడిచినా తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి.
ప్రశ్న: దగ్గు, జలుబు తగ్గడం లేదు?
– గడ్డం తిరుపతి, వెంకటాపురం(ఎం)
డీఎంహెచ్‌ఓ: చలికాలంలో ఇన్ల్పూఝెంజా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వ్యాప్తి చెందుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. చలి సమయంలో వెచ్చగా ఉండే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలి. వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే శరీరం నిండుగా ఉండేలా దుస్తులు ధరించాలి.
ప్రశ్న: చలికాలంలో గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– లక్ష్మీ, అడవిరంగాపూర్
డీఎంహెచ్‌ఓ: గర్భిణులకు చలితీవ్రత కారణంగా దగ్గు, జలుబు వస్తుంటాయి. గర్భిణులు చలి సమయంలో బయటకు రాకుండా ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, న్యూటిషన్, డ్రైప్రూట్స్ తీసుకోవాలి. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. జలుబు, దగ్గును సంప్రదాయ పద్ధతులతో తగ్గించుకోవాలి.
ప్రశ్న: పిల్లలు తరుచూ దగ్గు, జలుబు బారిన పడుతున్నారు.. సూచనలు అందించండి?
– పంబిడి దేవేందర్‌రావు, వెంకటాపురం(ఎం)
డీఎంహెచ్‌ఓ: చలి కాలంలో వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్ కారణంగా పిల్లల్లో తరుచూ దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబును ఇంటి చిట్కాలతో తగ్గించుకోవడం మంచిది. తగ్గని పక్షంలో వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. వీలైనంత వరకు యాంటిబయాటిక్‌లను వినియోగించడం తగ్గించాలి. రాత్రి సమయాల్లో పిల్లలకు వెచ్చని బ్లాకెట్లను కప్పి తలకు మంకిక్యాపులు ఉండేలా చూడాలి. పిల్లలకు ఉదయం వేడి నీటితో స్నానం చేయించాలి. చలి సమయాలలో బయట తిరగకుండా చూసుకోవాలి.
ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి?
– నేతాజీ, ఎస్‌ఎస్ తాడ్వాయి
డీఎంహెచ్‌ఓ: వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్న లేదా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం తీసుకోకూడదు. బయట దొరికే చిరుతిండ్లు మానేయాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీం వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. చలికాలంలో ప్రజలు తక్కువ మోతాదులో నీటిని తీసుకుంటారు. తప్పనిసరిగా సరిపడా నీటిని తీసుకోవాలని లేని పక్షంలో కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
ప్రశ్న:పొగమంచు ఎక్కువగా ఉంటుంది.
తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఏంటి?
– గుంటి రాజు, బుట్టాయిగూడెం
డీఎంహెచ్‌ఓ: ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏజెన్సీలోని గ్రామాల్లో మరింతగా ఉంది. 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు మనం తట్టుకోగలుగుతాం. ఉదయం ఎక్కువగా చలి, మంచు కురుస్తుంది. కాబట్టి బయటకు వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరించాలి. తలకు మంకి క్యాంపులు, చెవులకు గాలి తగలకుండా, చేతులకు గ్లౌజ్‌లు, శరీరానికి చలిగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేయాలి.
డీఎంహెచ్‌ఓ: చలి కారణంగా ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండె సమస్యలు, బీపీ, షుగర్ ఉన్నవారు చలి సమయంలో బయటకు రాకుండా ఉండాలి. చలి కారణంగా రక్తనాళాలు దగ్గరకు వచ్చి గుండెపోటు, బ్రెయిన్ స్టోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించాలి. బీపీ, షుగర్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి.
బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ
జలుబు, దగ్గుకు ఇంటి రెమిడితో నయం
‘సాక్షి ఫోన్‌ఇన్’లో జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు
చలికాలం.. జాగ్రత్త


