సుందరీమణుల సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ దివాకర
ములుగు: ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణుల సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీష్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులు పలు దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల 14న వెంకటాపురం(ఎం) మండలంలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారని, హైదరాబాద్ నుంచి సుందరీమణులు నేరుగా రామప్ప హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారన్నారు. పోలీస్ శాఖ తరఫున బందోబస్తు నిర్వహించాలని సూచించారు. హరిత కాకతీయ నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని దైవ దర్శనం చేసుకుంటారని, ఆలయం వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ విశిష్టను సుందరీమణులకు వివరించాలని గైడ్‌లను ఆదేశించారు. ఫొటోషూట్, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఈనెల 8 తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహా స్వామి కల్యాణ బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


