ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి..
ములుగు రూరల్: ఎస్టీ ఉపకులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మండలంలోని రాయినిగూడెంలో ఎస్టీ వర్గీకరణ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ తెగల్లో ఏబీసీడీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ.. 1996లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బకట్ల నర్సింగరావు ఆశయ సాధనకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్టీ, ఎస్సీ ఉప కులాలు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందేలా వర్గీకరణ చేపట్టాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో నేడు(శుక్రవారం) నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తవిటి నారాయణ, నెమలి నర్సయ్య, స్వామి, జగ్గారావు, వజ్జ రాజు, రమేశ్, సాంబయ్య, వినీత్ పాల్గొన్నారు.


